చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌...

By -  అంజి
Published on : 6 Jan 2026 6:29 AM IST

Hyderabad, CP Sajjanar, criminal cases, Chinese manja

చైనీస్ మాంజా విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్‌ కేసులు

సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనీస్‌ మాంజా విక్రయాలు, వాడకంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ తెలిపారు. పక్షుల స్వేచ్ఛకు, అమాయక వాహనదారుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను ఎవరైనా రహస్యంగా విక్రయించినా, నిల్వ ఉంచినా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చైనీస్‌ మాంజా నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పండుగ పూట గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని హితవు పలికారు. చైనీస్ మాంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోందని, ఇది మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు.

ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. నగరంలోని అన్ని జోన్లలోని కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

కేవలం విక్రయదారులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి అక్రమంగా ఈ నిషేధిత మాంజాను రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపైనా నిఘా పెంచామని, వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఏజెన్సీ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, ఇతర సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకుల మిశ్రమం పూతగా ఉంటుందని, దీనివల్ల ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడంతో పాటు, పిల్లల వేళ్లు తెగిపోయే ప్రమాదం ఉందని వివరించారు. అంతేకాకుండా, ఇందులో ఉండే మెటాలిక్ పదార్థాల వల్ల విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారాలను మాత్రమే ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు.

నగర పౌరులు కూడా సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీపీ పిలుపునిచ్చారు. మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత చైనీస్ మాంజా విక్రయిస్తున్నట్లు లేదా నిల్వ చేసినట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి గానీ, హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 9490616555 గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

Next Story