హైదరాబాద్: ఈ మధ్య కాలంలో లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియాలో జనాలను మోసం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. కార్లు, బైక్లు, ప్లాట్లు లక్కీ డ్రా అంటూ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఈ విషయమై తాజాగా హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనార్ స్పందించారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. The Prize Chits and Money Circulation Schemes (Banning) Act-1978 ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని, పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు.