సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..37 మంది అరెస్ట్

సైబర్ నేరాలను అరికట్టడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు

By -  Knakam Karthik
Published on : 8 Feb 2026 3:03 PM IST

Hyderabad, CyberCrimes, Hyderabad Police, Digital Arrests, Business Frauds

సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం..37 మంది అరెస్ట్

హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టడమే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. 2026 జనవరి మాసంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలకు చెందిన 37 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో మొత్తం 26 కీలక కేసులను ఛేదించినట్లు అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & ఎస్‌ఐటీ) ఎం. శ్రీనివాసులు వెల్లడించారు.

నేరాల విశ్లేషణ మరియు రికవరీ:

జనవరి నెలలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 117 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదయ్యాయి. అరెస్ట్ అయిన నిందితుల మోడస్ ఆపరాండీ (MO) పరిశీలిస్తే..ఇన్వెస్ట్‌మెంట్ మోసాల కేసులు-15, డిజిటల్ అరెస్ట్-02 కేసులు, సోషల్ మీడియా-04 కేసులు, బిజినెస్, గేమింగ్, జాబ్ ఫ్రాడ్స్ 05 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రూ. 65 కోట్ల భారీ లావాదేవీలు:

అరెస్ట్ అయిన నిందితులకు దేశవ్యాప్తంగా 86 కేసులతో సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా సుమారు రూ. 65 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 79 సిమ్ కార్డులు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్కు పుస్తకాలు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

కీలక కేసు ఛేదనం - మ్యాట్రిమోనీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్:

యూకేలో ఇంజనీర్‌గా నటిస్తూ ఒక మహిళా నిందితురాలు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి 'Bakktcoin' అనే ఫేక్ క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడి పెట్టించింది. బాధితుడు రూ. 11.20 లక్షలు కోల్పోగా, ఈ కేసులో నిందితులకు సిమ్ కార్డులు సరఫరా చేసిన ఏపీకి చెందిన గెడ్డవలస రవికిరణ్, చోడిపల్లి గంగరాజులను అరెస్ట్ చేశారు.

జోనల్ సైబర్ సెల్స్ మరియు సి-మిత్ర (C-MITRA) విజయం:

జనవరిలో జోనల్ సైబర్ సెల్స్ 1706 ఫిర్యాదులను స్వీకరించగా, 'సి-మిత్ర' చొరవతో 315 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ విభాగం ద్వారా మరో 13 మందిని అరెస్ట్ చేసి, రూ. 10.65 లక్షల నగదును బాధితులకు వెనక్కి ఇప్పించారు.

Next Story