నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ధర్నా
ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేస్తూ.. మెట్రో అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది.
By అంజి Published on 14 Aug 2024 12:33 PM ISTనాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ధర్నా
హైదరాబాద్: ఫ్రీ పార్కింగ్‌ను ఎత్తివేస్తూ.. మెట్రో అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఉధృత వాతావరణం నెలకొంది. ప్రయాణికులందరూ ధర్నా చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ప్రయాణికులకు ప్రీ పార్కింగ్ సదుపాయాన్ని మెట్రో అధికారులు కల్పించారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు చేసే చాలామంది ప్రయాణికులు మెట్రో స్టేషన్‌లో వారి వాహనాలు నిలిపివేసి మెట్రో రైలులో ప్రయాణం చేస్తుండేవారు. అయితే ఇప్పుడు అధికారులు కీలక నిర్ణయం తీసుకుని, నాగోల్ మెట్రో స్టేషన్ లో ఫ్రీ పార్కింగ్ ఎత్తి వేయడం జరిగింది.
నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉన్న ఫ్రీ పార్కింగ్ ఎత్తివేసి, ధరలు నిర్ణయించారు. బైక్‌లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి అని బోర్డు పెట్టారు. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30, 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు రూ.120 చొప్పున ధరలు నిర్ణయించారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణికులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు.
తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికులు, మెట్రో సిబ్బందితో వాగ్వవాదానికి దిగారు. అధికంగా టికెట్స్ రేటు పెంచి, ఇప్పుడు పార్కింగ్‌కు కూడా డబ్బులు వసూలు చేయడం అన్యాయమంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలని మెట్రో ప్రయాణికుల డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రయాణికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.