హైదరాబాద్కు చెందిన వ్యవసాయ మార్కెట్ ఆపరేటర్.. రాజస్థాన్కు చెందిన ధాన్యం వ్యాపారికి రూ.70 లక్షలు టోకరా వేశాడు. ఈ మేరకు ధాన్యం విక్రేత కైలాశ్ చంద్ శర్మ.. జైపుర్లోని ముహానా పోలీస్ స్టేషన్లో కేసు దాఖలు చేశాడు.
హైదరాబాద్లోని బాలాజీ ట్రేడర్స్కు చెందిన సంచిత్ భన్సాల్.. జైపుర్కు చెందిన కైలాశ్ను ధాన్యం కోసం సంప్రదించాడు. రాజస్థాన్లోని కుచామన్, బగ్రూ, చాక్సూ నగరాల నుంచి కూడా ఆహార ధాన్యాలను కొనుగోలు చేస్తున్నట్లు సంచిత్ తెలిపాడు.కైలాశ్ నమ్మకాన్ని చూరగొనేందుకు తొలిసారి సరకు అందిన వెంటనే రూ. 50 లక్షలను చెల్లించాడు. అనంతరం 18 లోడుల జొన్నలు, చిరుధాన్యాలను కైలాశ్ నుంచి సంచిత్ ఆర్డర్ చేశాడు. వీటి విలువ రూ.70 లక్షలు. మూడు రోజుల తర్వాత డబ్బులు చెల్లిస్తానని కైలాశ్కు చెప్పాడు సంచిత్ భన్సాల్. అయితే, ఐదు రోజుల తర్వాత కూడా డబ్బులు పంపించలేదు.
దీంతో హైదరాబాద్లోని ఇతర ట్రేడర్లను కైలాశ్ సంప్రదించి సంచిత్ గురించి ఆరా తీశాడు. సంచిత్ తన ట్రేడర్స్ను మూసేసి పారిపోయాడని తెలుసుకొని కైలాశ్ అవాక్కయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.