బేగంపేట విమానాశ్రయంలో టెన్షన్ పెట్టిన విమానం

ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. హైడ్రాలిక్ చక్రాల ఓపెనింగ్ మెకానిజంలో

By Medi Samrat  Published on  1 March 2024 12:12 PM GMT
బేగంపేట విమానాశ్రయంలో టెన్షన్ పెట్టిన విమానం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపం ఉండడంతో నలభై నిమిషాల పాటూ ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో ఆ విమానంలో 12 మంది ఉన్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా.. సురక్షితంగా బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. సాంకేతిక లోపంతో విమానం దాదాపు నలభై నిమిషాల పాటు హైదరాబాద్ లోని ఆకాశంలో చక్కర్లు కొట్టింది. విమానంలోని పైలట్లు తమ పరిస్థితి గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్‌ను అప్రమత్తం చేశారు. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, మధ్యాహ్నం నుంచి విమానం గాలిలో తిరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ విమానాన్ని గాలిలో ఉంచడానికి, సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి సిబ్బందికి మార్గనిర్దేశం చేసింది.

ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. హైడ్రాలిక్ చక్రాల ఓపెనింగ్ మెకానిజంలో లోపం ఉన్నట్లు విమానం పైలట్ గమనించాడు. అప్రమత్తమైన పైలట్ వెంటనే మిగిలిన సిబ్బందిని అప్రమత్తం చేశాడు. పైలట్ 40 నిమిషాల పాటు విమానంలో సాంకేతిక సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపటికి సాంకేతిక సమస్య పరిష్కరించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. బేగంపేట విమానాశ్రయానికి అత్యవసర పరిస్థితి గురించి ముందుగానే తెలియజేశారు. హార్డ్ ల్యాండింగ్‌ విషయంలో అందరినీ సిద్ధం చేశారు. IAF శిక్షణా విమానం హైడ్రాలిక్ లోపం వల్ల గాలిలోనే ఉండాల్సి వచ్చిందని.. ఇంధనం అయిపోయిన తర్వాతే ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని సంబంధిత వర్గాలు ముందే తెలిపాయి. కానీ టెక్నీకల్ సమస్యలు పరిష్కరించడంతో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. IAF విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు ఇతర విమానాల సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.


Next Story