బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది.

By Srikanth Gundamalla  Published on  16 May 2024 4:54 AM GMT
hyderabad, begumpet flyover, road accident, car,

బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం

కొందరు వాహనదారులు రోడ్డు కొంచెం ఖాళీగా కనిపిస్తే చాలా అత్యంత వేగంగా వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ప్రమాదాలకు గురవుతుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ల లైఫ్‌ను రిస్క్‌లో పడేసుకోవడమే కాదు.. ఎదుటివారిని ఇబ్బందుల్లో పడేస్తుంటారు. అయితే.. ఉదయం వేళల్లో హైదరాబాద్‌ నగరంలో రోడ్లు కాస్త ఖాళీగానే ఉంటాయి. తాజాగా బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు వేగంగా వెళ్తూ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో డ్రైవర్‌ సహా మహిళకు గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌లోని బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఫ్లై ఓవర్‌పై నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న ఒక మారుతి కారు హంగామా సృష్టించింది. వేగంగా వెళ్తున్న క్రమంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో.. ముందుగా కారు డివైడర్‌ను ఢీకొట్టింది ఆ తర్వాత అంతటితో ఆగని కారు మరో ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. ఇక దాంతో.. రివర్స్‌లో ఫ్లై ఓవర్‌ వాల్‌ను ఢీకొట్టి అక్కడితో ఆగిపోయింది. ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇతర వాహనదారులు భయపడిపోయారు. కారు ఫ్లై ఓవర్‌ పైనుంచి కింద పడకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం, వెనుక భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. కారు డ్రైవర్‌తో పాటు.. అందులో ఉన్న మహిళకు గాయాలు అయ్యాయి. ఇక ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత కొంతసేపు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ జామ్‌ కాగా.. ట్రాఫిక్‌ పోలీసులు వాటిని క్లియర్ చేశారు. దీనిపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


Next Story