ఏవియేషన్ షోకు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వడం గర్వకారణమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బేగంపేటలో జరుగుతున్న ఏవియేషన్ షోలో భాగంగా వింగ్ ఇండియా ఏవియేషన్ సదస్సును కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏవియేషన్, ఏరోస్పేస్ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలన్నారు. ఫ్లయింగ్ ఫర్ ఆల్ విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు.
పాత విమానాశ్రయాల పునరుద్ధరణ, గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వాటర్ ఎయిరో డ్రోమ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామన్నారు. అన్ని జిల్లాల్లో హెలీప్యాడ్ల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎయిరో స్పేస్ తయారీ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతున్నదన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. డ్రోన్ పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం తన విజన్‌ను చాటిచెప్పిందన్నారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాక. ఫిక్కి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఎయిర్ షో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. తొలి రోజు బీ2బీ మీటింగ్స్‌లో భాగంగా ఎయిర్ బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో తమ భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికలు పంచుకున్నారు. భారత్ తమకు కీలక వ్యాపార భాగస్వామి అని రాబోయే 20 ఏళ్లలో 2,210 ఎయిర్ బస్ విమానాలను భారత్‌కు అందజేస్తామని ఎయిర్ బస్ ప్రకటించింది.