ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసు.. విజిలెన్స్‌కు ఏసీబీ రిపోర్ట్‌

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్‌ కమిషన్‌కు అప్పగించింది.

By -  అంజి
Published on : 13 Sept 2025 1:00 PM IST

Hyderabad, ACB report, Vigilance Commission, Formula E car race case

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసు.. విజిలెన్స్‌కు ఏసీబీ రిపోర్ట్‌

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ఏసీబీ విజిలెన్స్‌ కమిషన్‌కు అప్పగించింది. రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి తిరిగి ఏసీబీకి రిపోర్ట్‌ చేరుతుంది. కేటీఆర్‌, ఐఏఎస్‌ అధికారి అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి ప్రాసిక్యూషన్‌పై తుది నివేదిక వచ్చాక ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించే అవకాశం ఉంది. ఈ కార్‌ రేస్‌ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, మరో ఇద్దరు ఏ4, ఏ5 నిందితులుగా ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్‌ను, అరవింద్‌ కుమార్‌ను ఏసీబీ ప్రశ్నించింది. బీఆర్‌‌ఎస్‌ హయాంలో 2023 ఫిబ్రవరిలో హుస్సేన్‌‌ సాగర్‌ ‌దగ్గర ఫార్ములా–ఈ కార్ రేస్‌‌ నిర్వహించబడింది. ఈ ఎలక్ట్రిక్‌‌ కార్ల రేసింగ్‌‌ కోసం బ్రిటన్‌‌కు చెందిన ఫార్ములా - ఈ ఆపరేషన్స్‌‌, హైదరాబాద్‌‌కు చెందిన గ్రీన్‌‌కో సిస్టర్ కంపెనీ ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య 2022 అక్టోబర్‌‌25న ఒప్పందం జరిగింది. దీని ప్రకారం నాలుగు సీజన్లకు గాను మూడేళ్ల పాటు రూ.600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా హుస్సేన్‌‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9,10,11,12 కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ సమకూర్చాల్సి ఉంది.

2023 ఫిబ్రవరి 11న సీజన్‌‌ 9 నిర్వహించారు. పలు కారణాల వల్ల ఏస్‌‌ నెక్ట్స్‌‌ జెన్‌‌, ఫార్ములా‌‌‌–ఈ ఆపరేషన్స్‌‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థ కార్ రేస్‌‌ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్ ​ఆదేశాలతో ఐఏఎస్ ​అర్వింద్‌‌కుమార్‌‌ ఆధ్వర్యంలో ఫార్ము లా-ఈ ఆపరేషన్స్‌‌, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌‌ 30న కొత్తగా మరో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని ఏసీబీ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసినట్టు తెలిసింది.

Next Story