Hyderabad: కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
హైదరాబాద్‌లో కుక్కల దాడికి మరో చిన్నారి బలయ్యాడు. కుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
By అంజి Published on 25 Dec 2023 9:14 AM ISTHyderabad: కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి
హైదరాబాద్‌లో కుక్కల దాడికి మరో చిన్నారి బలయ్యాడు. షేక్‌పేట్‌కు చెంది అనూష, అంజి దంపతులు తమ కుమారుడు శరత్ (5 నెలలు)ను ఈ నెల 8వ తేదీన గుడిసెలో పడుకోబెట్టి పనికోసం బయటకు వెళ్లారు. కాసేపటికే వచ్చి చూడగా కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారి ఏడుస్తూ కనిపించాడు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నీలోఫర్, ఉస్మానియాకు తీసుకెళ్లారు. 17 రోజులపాటు చిన్నారి చావు బతుకుల మధ్య పోరాడాడు. చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. కళ్ల ముందే కదలాడే కుమారుడు విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మూడు వీధి కుక్కలు దాడి చేసినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
నవంబర్ చివరి వారంలో బహదూర్‌పురలోని నంది ముసలాయిగూడలో వీధికుక్క కొరకడంతో ఆరేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంతకు ముందు ఏడాది ఫిబ్రవరిలో కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందింది. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు తెలంగాణలోని వివిధ జిల్లాల్లో వీధికుక్కల దాడి సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. వీధికుక్కల దాడులు కొనసాగుతున్న దృష్ట్యా ప్రభుత్వం, సంబంధిత అధికారులు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలి.