Hyderabad: మైనర్లతో అసభ్యకర కంటెంట్‌.. రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై పోక్సో కేసు నమోదు

మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది.

By -  అంజి
Published on : 19 Oct 2025 7:14 AM IST

Hyderabad, POCSO, YouTube channels, inappropriate content, minors

Hyderabad: మైనర్లతో అసభ్యకర కంటెంట్‌.. రెండు యూట్యూబ్‌ ఛానళ్లపై పోక్సో కేసు నమోదు

హైదరాబాద్‌: మైన‌ర్ల‌తో అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ చేసిన రెండు యూట్యూబ్ చాన‌ళ్ల‌పై హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో పొక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు అయింది. మైనర్లకు సంబంధించిన ఆక్షేపణీయ కంటెంట్‌ను ప్రసారం చేసినందుకు E96TV, వైరల్‌ హబ్‌ చానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. “మైనర్ జంట” ఇంటర్వ్యూ వీడియోలు వైరల్ కావడంతో.. ఐటీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ & పొక్సో చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. 'సోష‌ల్‌మీడియాలో స్వేచ్ఛ ఉంది క‌దా అని.. ఏ త‌ర‌హా కంటెంట్ అయినా చేస్తామంటే కుద‌ర‌దు. చ‌ట్ట‌ప్ర‌కారం బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లను పోలీస్ శాఖ తీసుకుంటుంది' అని సీపీ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు.

''వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు.. క్షమార్హం.. చట్టరీత్యా నేరం'' అని సజ్జనార్‌ తెలిపారు.

''ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది'' అని చెప్పారు.

''సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ(ప్రజల) దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి'' అని సీపీ సజ్జనార్‌ సూచించారు.

Next Story