Hyderabad: షవర్మా తిని 17 మందికి అస్వస్థత.. హోటల్‌ నిర్వాహకుడు అరెస్ట్‌

అల్వాల్ లోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. షవర్మాకు మయోనైస్ కలిల010పి తినడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on  17 Jan 2024 10:00 AM IST
Hyderabad, Shawarma House, illness

Hyderabad: షవర్మా తిని 17 మందికి అస్వస్థత.. హోటల్‌ నిర్వాహకుడు అరెస్ట్‌

హైదరాబాద్: అల్వాల్ లోని గ్రిల్ హౌస్ లో షవర్మా తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. షవర్మాకు మయోనైస్ కలిపి తినడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు రోజుల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనలో మొదట నలుగురు బాధితులు ఉండగా.. మంగళవారం నాటికి ఆ సంఖ్య 17కు చేరుకుంది. షవర్మా తిన్న తర్వాత బాధితులు వాంతులు, విరేచనాలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారినపడ్డారు. బాధిత వ్యక్తులందరూ ప్రస్తుతం కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్ బొల్లారంలో చికిత్స పొందుతున్నారు.

బాధితుల రక్త పరీక్షల్లో హానికరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలిందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) అధికారి ధృవీకరించారు. పరిస్థితిని పరిష్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అల్వాల్‌ లోతుకుంటలోని గ్రిల్‌ హౌజ్‌ హోటల్‌లో ఈనెల 12న శుక్రవారం సాయంత్రం మయోనైస్‌తో కలిపి షవర్మను ఆరగించిన కొందరు వాంతులు, విరేచనాలతో స్థానిక ఆస్పత్రిలో చేరారని జీహెచ్‌ఎంసీ ఆహార భద్రతా అధికారి (ఎఫ్‌ఎస్‌ఓ) లక్ష్మీకాంత్‌ తెలిపారు. బాధితుల రక్తపరీక్షల్లో సాల్మనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. సోమవారానికి బాధితుల సంఖ్య పెరిగిందన్నారు.

షవర్మా, కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, శాండ్‌విచ్‌లను సాధారణంగా మయోనైస్‌ను రాసుకుని ఆరగిస్తారు. ఇది గుడ్డు పచ్చసొన, నిమ్మరసం, నూనెతో తయారు చేయబడుతుంది. మయోనైస్, దాని తయారీ సమయంలో పరిశుభ్రత ప్రమాణాలు రాజీపడినప్పుడు ప్రమాదాన్ని కలిగిస్తుంది. శుభ్రంగా తయారైన మయోనైజ్‌ను కూడా నాలుగు గంటల్లోపు వాడేయాలని, అంతకు మించి నిల్వ ఉంచిన కోడిగుడ్డు మయోనైజ్‌ విషంలా మారొచ్చని, అది అనారోగ్యానికి దారితీస్తుందని ఎఫ్‌ఎస్‌ఓ లక్ష్మీకాంత్‌ వివరించారు. జీహెచ్‌ఎంసీ గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. మయోనైస్‌ తిని చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, పరిశుభ్రత ప్రమాణాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మేనేజర్ అరెస్ట్:

గ్రిల్ హౌస్ మేనేజర్ తౌఫిక్‌ను అరెస్టు చేశారు. జనవరి 13న లోత్‌కుంటలోని గ్రిల్‌హౌస్‌లో షవర్మా తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారని అల్వాల్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ దేవ్ వెల్లడించారు. ప్రస్తుతం 13 మంది బాధితులు కంటోన్మెంట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆహారం కలుషితం కావడమే అస్వస్థతకు కారణమని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ధారించారు. అల్వాల్‌లోని లోత్‌కుంటలో ఉన్న గ్రిల్ హౌస్‌పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి లక్ష్మీకాంత్ అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఐపీసీ 273, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బాధ్యులైన మేనేజర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Next Story