హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ఆర్కే పురం వంతెన నుండి ఆర్మీ పబ్లిక్ పాఠశాల వైపుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై తన ఏడేళ్ల బాలుడిని పాఠశాలలో వదిలెందుకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తల్లి కొడుకు కింద పడినట్లు పోలీసులు తెలిపారు.
అదే సమయంలో వారి వెనకే వస్తున్న ఆర్మీ వాహనం వేగంగా దూసుకు వచ్చి వారి పైనుండి వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తల్లికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నేరేడుమెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తండ్రి జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.