హుస్సేన్‌సాగర్‌ మధ్యలో నిలిచిపోయిన టూరిస్ట్‌ బోటు.. అసలు ఏం జరిగిందంటే?

Hussain sagar 60 people travelling boat break down in middle. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. 60 మంది టూరిస్ట్‌లు ఉన్న బోటు టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌తో

By అంజి  Published on  15 July 2022 9:19 AM GMT
హుస్సేన్‌సాగర్‌ మధ్యలో నిలిచిపోయిన టూరిస్ట్‌ బోటు.. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. 60 మంది టూరిస్ట్‌లు ఉన్న బోటు టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌తో సాగర్‌ మధ్యలో నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. బుధవారం నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆనంద్‌ ధర్మాన అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్వీట్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుని విగ్రహం వద్దకు వెళ్లి.. తిరిగి వెనక్కి వస్తున్న సమయంలో భారీ ఈదురు గాలుల ధాటికి ముందు కదలలేక బోటు ఇంజిన్ ఆగిపోయింది.

అప్రమత్తమైన టూరిజం సిబ్బంది నిర్వాహకులకు సమాచారం అందించారు. వెంటనే స్టీమర్‌ బోట్లను రంగంలోకి దింపి.. పెద్ద బోటును ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ఆనంద్‌ అనే వ్యక్తి హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ అకౌంట్‌లో రాశారు. ఈ ఘటనపై టూరిజం ఎండీ మనోహర్ స్పందించారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బోటు ఇంజిన్‌ స్లో చేస్తామని తెలిపారు. ఒక్కొక్కసారి స్టీమర్‌ బోట్లతో ఒడ్డుకు చేరుస్తామన్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో హుస్సేన్‌సాగర్‌లోకి టూరిస్ట్ బోటులను అనుమతించడంలేదని తెలిపారు.


బోటు నిలిచిన విషయాన్ని లుంబిని పార్క్‌లోని బోటింగ్‌ టికెట్‌ నిర్వాహకులను అడుగగా.. ''బోటు నిలిచిన విషయం వాస్తవమే. టెక్నికల్‌ కారణాల వల్ల బోట్లు అప్పుడప్పుడు నిలిచిపోతుంటాయి. అయితే మేం వెంటనే స్పందించాం. బోటును స్టీమర్ల ద్వారా ఒడ్డుకు చేర్చాం'' అని అతడు చెప్పాడు. అలాగే గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా భారీ వరదలు వచ్చాయి. ఈ క్రమంలోనే భద్రాద్రి గోదావరితో పాటు ఇతర ప్రాంతాలకు రెస్క్యూ ఆపరేషన్స్‌ కోసం తెలంగాణ టూరిజం బోట్లను పంపించామని చెప్పారు.


''ప్రస్తుతం సాగర్‌లో బోటింగ్‌ జరుగుతోంది. ఆ మొన్న వర్షాల వల్ల బోటింగ్‌ను నిలిపివేశారు. కానీ నిన్న, ఇవాళ బోటింగ్‌ జరుగుతోంది. పర్యాటకులు కూడా వస్తున్నారు. పర్యాటకులు తక్కువ సంఖ్యలో వస్తే బోటింగ్‌ను నిర్వహకులు ఆపేస్తారు.'' అని బోటింగ్‌ టికెట్‌ కౌంటర్‌ పక్కనే ఉన్న ఓ స్టాల్‌ నిర్వహకుడు చెప్పాడు. కాగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని వానలతో తడిసి ముద్దయ్యేలా చేసిన వరుణుడు నిన్న, ఇవాళ కాస్తా శాంతించాడు. కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాలు తగ్గడంతో ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ పనులకు వెళ్తున్నారు.


Next Story