Hyderabad: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం: 18 షాపులు బూడిద.. రూ.5 కోట్ల ఆస్తినష్టం!

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని, భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది.

By -  అంజి
Published on : 4 March 2026 7:21 AM IST

Bachupally Fire Accident, Hyderabad Furniture Shops Fire, Short Circuit Fire Hyderabad, KGR Convention Center Fire, Property Loss Bachupally, Fire Safety Hyderabad

Hyderabad: బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం: 18 షాపులు బూడిద.. రూ.5 కోట్ల ఆస్తినష్టం!

హైదరాబాద్‌లోని బాచుపల్లిలో మంగళవారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని, భారీ ఆస్తినష్టాన్ని మిగిల్చింది. బాచుపల్లి-మియాపూర్ ప్రధాన రహదారిపై ఉన్న ఫర్నీచర్ దుకాణాలు అగ్నికి ఆహుతవ్వడంతో సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

బాచుపల్లి ప్రధాన రహదారి వెంబడి కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ నుండి సాయినగర్ రోడ్డు మలుపు వరకు వరుసగా సుమారు 25 ఫర్నీచర్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో లక్షల రూపాయల విలువైన కలప సామగ్రి, సోఫాలు, ఇతర గృహోపకరణాలను నిల్వ ఉంచుతారు. మంగళవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ (విద్యుదాఘాతం) కారణంగా ఒక దుకాణంలో మంటలు మొదలయ్యాయి. కలప సామగ్రి కావడంతో మంటలు అతి వేగంగా పక్కనే ఉన్న మరో 17 దుకాణాలకు విస్తరించాయి. మొత్తం 18 షాపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కొందరు వ్యాపారులు తమ దుకాణాల్లోనే నివాసం ఉంటుండటంతో అక్కడ వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. మంటల వేడికి ఈ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

ఈ మంటల ధాటికి సమీపంలోని కేజీఆర్ కన్వెన్షన్ సెంటర్ ముందు భాగం కూడా పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సామగ్రి అంతా బుగ్గిపాలు కావడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story