గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది.
By - Knakam Karthik |
గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
హైదరాబాద్: చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్‌లో విహరించి సందడి చేశారు. ఆకాశ మార్గంలో సుమారు గంటన్నర సేపు 13 కిలోమీటర్లు విహరించారు. హైదరాబాద్ గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైన హాట్ ఎయిర్ బలూన్ అప్పొజి గూడ శివారులో దిగింది.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.... తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదిక అని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఒకవైపు 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం మరియు ఆతిథ్యాన్ని చాటుతుండగా, మరోవైపు 'హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ల ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు.
డెస్టినేషన్ తెలంగాణ - ప్రపంచ పర్యాటక కేంద్రంగా.. తెలంగాణలోని సహజ సౌందర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. "డెస్టినేషన్ తెలంగాణ" అనే బ్రాండ్‌ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షించేలా ఇటువంటి సాహసోపేత క్రీడలు (Adventure Sports) ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక గొప్ప అనుభూతిని పొందేలా వినూత్న కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ, భాగస్వామ్య పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యమన్నారు. ఇదొక అద్భుత అనుభూతి. సంప్రదాయానికి గౌరవం, సాంకేతికతకు స్వాగతం పలుకుతూ పర్యాటక రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోంది అనడానికి నిదర్శనం" అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, యువత, పిల్లలందరికీ ఈ ఫెస్టివల్ ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Hot air balloons spotted near Gandipet.The Telangana Tourism Department is organizing a hot air balloon festival at Jala mandali Park, Gandipet.@TravelTelangana @kranthi_valluru @jayesh_ranjan pic.twitter.com/XuDkQrVCAb
— Hyderabad Real Estate & Infra (@HydREGuide) January 16, 2026