హైదరాబాద్‌లో స్థిరపడాలని.. నిజాం కుటుంబానికి హోంమంత్రి విజ్ఞప్తి
Home Minister appeals to Asaf Jah royals to settle in Hyderabad. హైదరాబాద్‌లో శాశ్వతంగా ఉండేందుకు అన్ని విధాలా సహకరిస్తామని
By అంజి
హైదరాబాద్‌లో శాశ్వతంగా ఉండేందుకు అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం యువరాణి ఎస్రా, ప్రిన్స్ అజ్మత్ అలీ ఖాన్ అలియాస్ అజ్మత్ జాలకు హామీ ఇచ్చింది. అసఫ్ జా VIII నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకర్రం జా బహదూర్ అంత్యక్రియల సందర్భంగా.. హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాజ కుటుంబాన్ని హైదరాబాద్‌లో శాశ్వతంగా ఉండాలని కోరారు. తద్వారా వారు ముకర్రం జా బహదూర్ ప్రారంభించిన విద్యా, సంక్షేమ కార్యకలాపాలను కొనసాగించవచ్చని చెప్పారు.
హైదరాబాద్‌లో శాశ్వతంగా స్థిరపడాలని కోరుతూ 2014లో ముకర్రం జా బహదూర్‌కు పంపిన లేఖను మహమూద్ అలీ ప్రస్తావించారు. ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. ఈ ఆఫర్‌కు అప్పట్లో మకర్రం జా వ్రాతపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్‌లో ఉండలేనని తెలియజేశారు. టర్కీ నుంచి ముకర్రం జా భౌతికకాయం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు హోంమంత్రి మహ్మద్ అలీ నివాళులర్పించి యువరాణి ఎస్రా, ప్రిన్స్ అజ్మత్ జాలను హైదరాబాద్‌లో స్థిరపడాలని కోరారు.
హైదరాబాద్ ప్రజలు అసఫ్ జాహీ కుటుంబాన్ని హృదయపూర్వకంగా గౌరవిస్తారని, రాజకుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్‌లో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని అన్నారు. ప్రిన్స్ ఎస్రా, అజ్మత్ జా బహదూర్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు.
కాగా, అధికారిక లాంఛనాలతో మకరాం జహ్ బహదూర్ అంత్యక్రియలు జరగడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం వెళ్లే ముందు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను హోంమంత్రి మహమ్మద్ అలీకి అప్పగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రిన్స్ ఎస్రా ఫోన్‌లో మాట్లాడి.. ప్రభుత్వ ఏర్పాట్లు, అధికారిక గౌరవం పట్ల కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం.