Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల నుంచి 48 గంటల పాటు నీటి సరఫరా బంద్‌ కానుంది.

By అంజి  Published on  5 March 2023 4:54 PM IST
HMWSSB, Hyderabad

రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్ (ప్రతీకాత్మకచిత్రం)

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు.. గోదావరి నీటి పంపిణీ వ్యవస్థపై నిర్వహణ పనులను చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 8 నుంచి నగరంలోని చాలా ప్రాంతాలకు నీటి సరఫరా బంద్‌ కానుంది. మార్చి 8 నుంచి హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు 48 గంటల తాగునీటి సరఫరా అంతరాయాన్ని ఎదుర్కొంటాయి. హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారిక ప్రకటన ఇలా పేర్కొంది. ''ప్రియమైన వినియోగదారులారా.. గోదావరి తాగునీటి వ్యవస్థపై నిర్వహణ పనులను చేపట్టడానికి ప్రణాళిక చేయబడిన షట్‌డౌన్ కారణంగా 08.03.2023 నుండి 48 గంటల పాటు క్రింది ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దయచేసి తగినంత నీటిని ముందుగానే నిల్వ చేసుకోండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము.'' అంటూ ట్వీట్‌ చేసింది.

హైదరబాద్ శివారులోని షాపూర్‌, చింతల్‌, జీడిమెట్ల, వాణి కెమికల్స్‌, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సూరారం, మల్కాజిగిరి డిఫెన్స్‌ కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, కీసర, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/శామీర్‌పేట), కంటోన్మెంట్‌ ప్రాంతం, ఎంఈఎస్‌, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధితో పాటు కొండపాక, ప్రజ్ఞాపూర్‌, ఆలేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రాంతాలు నీటి సరఫరా విషయంలో పూర్తిగా ప్రభావితం అవుతాయి.

ఎస్‌.ఆర్‌ నగర్‌, బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ, కేపీహెచ్‌బీ, మలేషియన్‌ టౌన్‌షిప్‌, శేరిలింగపల్లి, కొండాపూర్‌, గోపాల్‌నగర్‌, మయూర్‌నగర్‌, నిజాంపేట్‌, బాచుపల్లి, ప్రగతి నగర్‌ ప్రాంతాలు.. నీటి సరఫరా విషయంలో పాక్షికంగా ప్రభావితం అవుతాయి.


Next Story