Hyderabad: పాతబస్తీలో మెట్రో రైలు పనులు ప్రారంభం

హైదరాబాద్ పాతబస్తీలో రాబోయే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సన్నాహక పనులను ప్రారంభించింది.

By అంజి  Published on  17 July 2023 5:48 AM GMT
HMRL, Hyderabad, Metro Rail, Old city

Hyderabad: పాతబస్తీలో మెట్రో రైలు పనులు ప్రారంభం

హైదరాబాద్ పాతబస్తీలో రాబోయే మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) సన్నాహక పనులను ప్రారంభించింది. పాతబస్తీలోని ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు ప్రారంభించినట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 5.5 కి.మీ. మేర మెట్రో లైన్‌ని నిర్మించనున్నారు. దారుల్‌షిఫా, పురానీ హవేలీ, ఇత్తేబార్ చౌక్, అలీజాకోట్ల, మీర్ మోమిన్ దైరా, హరిబౌలి, శాలిబండ, శంషీర్‌గంజ్, అలియాబాద్ వంటి ముఖ్యమైన జంక్షన్‌ల గుండా ఈ లైన్‌ వెళుతుంది. ప్రతిపాదిత మెట్రో లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షమ్‌షీర్‌గంజ్, ఫలక్‌నుమాతో ఐదు మెట్రో స్టేషన్లు ఉంటాయి.

సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ మధ్య సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ స్టేషన్‌లకు నగరంలో వాటి ప్రాముఖ్యత కారణంగా వాటికి ఆ పేరు పెట్టబడిందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మరో వైపు ఈ మెట్రో మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, ఏడు స్మశాన వాటికలు, ఆరు చిల్లాలతో సహా 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వక్రత సర్దుబాటు, వయాడక్ట్ డిజైన్, ఎత్తులు, మెట్రో పిల్లర్ స్థానాలకు తగిన మార్పు వంటి వినూత్న ఇంజనీరింగ్ పరిష్కారాల ద్వారా ప్రాజెక్ట్ మతపరమైన నిర్మాణాల కాపాడేందుకు మెట్రో యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా, మిగిలిన నాలుగు మతపరమైన నిర్మాణాలను రక్షించడానికి మెట్రో అలైన్‌మెంట్‌కు మరింత మెరుగులు దిద్దుతున్నారు. ఈ నిర్మాణాలను కాపాడేందుకు రోడ్ల విస్తరణ 80 అడుగులకే పరిమితం కానుంది. 1,000కు పైగా ఉన్న ప్రభావిత ఆస్తుల కోసం వ్యక్తిగత స్కెచ్‌లను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, నెలలోపు భూసేకరణ నోటీసులు జారీ చేస్తామని ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో రైలుతో సమర్థవంతమైన, సౌకర్యవంతమైన రవాణా ఎంపికను అందించాలని హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story