Hyderabad: లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం, త్వరలో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్. హుస్సేన్ సాగర్ తీరంలో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభానికి సిద్ధమైంది.

By అంజి  Published on  19 Sep 2023 5:15 AM GMT
HMDA, Lake Front Park,Jalavihar, Hyderabad

Hyderabad: లేక్ ఫ్రంట్ పార్కు సిద్ధం, త్వరలో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్‌ నగరం పర్యాటక రంగంలోనూ దూసుకుపోతోంది. ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్న హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు వస్తుంటారు. ఇక హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత పెంచుతూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఎన్నో సుందర నిర్మాణాలను చేపడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచేలా మరో అద్భుత నిర్మాణాన్ని చేపట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) హైదరాబాద్‌లోని జలవిహార్ పక్కన హుస్సేన్ సాగర్ లేక్ సమీపంలో ఉన్న లేక్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేసింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్త పార్కును త్వరలో ప్రారంభించనున్నారు. హైదరాబాదులోని జలవిహార్ సమీపంలోని పార్క్ యొక్క వీడియోను పంచుకుంటూ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘హుస్సేన్‌ సాగర్‌కు సమీపంలో, హైదరాబాద్‌ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం అందుబాటులోకి వచ్చింది. జలవిహార్‌కు సమీపంలో 10 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ లేట్‌ ఫ్రంట్‌ పార్క్‌ను నిర్మించింది. త్వరలోనే ఈ పార్క్‌ను ప్రారంభించనున్నాము. ప్రజలంతా ఈ కొత్త నిర్మాణాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. రూ. 15 కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణంలో అండర్‌పాస్‌లు, స్కైవేలు, సీటింగ్‌తో కూడిన వాటర్‌ ఛానల్స్‌, లేక్‌ వంటి అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. మధ్యలో చిన్నపిల్లలకు ఆటవిడుపు కోసం పార్క్‌ను కూడా నిర్మించారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర అందాలను, ప్రత్యేకించి హైదరాబాద్‌లో మరింత మెరుగులు దిద్దేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుండటం గమనార్హం.

Next Story