హైదరాబాద్‌లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని హిందూ, ముస్లిం సోదరులు మత సామరస్యానికి మరోసారి చాటి చెప్పారు. గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో హిందూ, ముస్లింలు కలిసి ఆనందంగా నృత్యం చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో చాలా మంది వీడియోపై కామెంట్స్ చేశారు. ఇది తరచుగా విభజనతో గుర్తించబడిన సమయంలో శాంతి, సోదరభావం యొక్క సందేశాన్ని పంపుతుందని చెప్పారు.
గణేష్ విసర్జన (నిమజ్జన) ఊరేగింపులు శాంతియుతంగా సాగేందుకు తెలంగాణ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్రంలోని ఎస్పీలు, కమిషనర్‌లతో సహా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి ఊరేగింపులకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, సంగారెడ్డి తదితర సున్నితమైన పట్టణాల్లో రైట్‌వింగ్ గ్రూపులకు ధీటుగా కొన్ని రాడికల్ సంస్థల కార్యకలాపాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
అటు గుజరాత్‌లోని వ్యారా నగరంలో జరిగిన గణపతి విసర్జన్ వేడుకల్లో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. రెండు వర్గాల ప్రజలు తమ ఐక్యతను ప్రదర్శించారు.