రికార్డులు సృష్టించిన కోకాపేట్‌ భూములు.. హైదరాబాద్‌ హిస్టరీలోనే ఫస్ట్‌టైం

నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేట్‌లో ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకం రికార్డులు సృష్టించింది. ఊహించనని రేట్లకు అక్కడి భూములు అమ్ముడు పోయాయి.

By అంజి  Published on  4 Aug 2023 3:22 AM GMT
Neopolis Layout, Kokapet,Hyderabad, HMDA

రికార్డులు సృష్టించిన కోకాపేట్‌ భూములు.. హైదరాబాద్‌ హిస్టరీలోనే ఫస్ట్‌టైం

హైదరాబాద్: నిధుల సమీకరణలో భాగంగా గండిపేట మండలం కోకాపేట్‌లో ప్రభుత్వం చేపట్టిన భూముల అమ్మకం రికార్డులు సృష్టించింది. ఊహించనని రేట్లకు అక్కడి భూములు అమ్ముడు పోయాయి. కోకాపేట్‌లోని నియోపోలిస్ లే అవుట్‌లోని భూముల ధరలు అంచనాలు మించి అమ్ముడుపోయాయి. నిన్న మధ్యాహ్నం సమయానికి హైదరాబాద్‌ హిస్టరీలోనే అత్యధిక ధరకు భూమి అమ్ముడుపోయిన రికార్డు నెలకొంది. ఇక వేలం పాట ముగిసే సరికి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. మొదటి విడత పూర్తి తర్వాత ప్రస్తుతం రెండో విడత భూముల వేలం చేపట్టింది హెచ్ఎండీఏ. ఈ వేలంలో హెచ్‌ఎండీఏ భారీ మొత్తంలో డబ్బులను సమీకరించింది.

నియోపోలీస్‌ లే అవుట్‌లోని భూముల వివరాలు చూస్తే.. ప్లాట్‌ నెంబర్‌ ఆరులో 7 ఎకరాల భూమి ఉంది. ప్లాట్‌ నెంబర్‌ 7లోని చూస్తే 6.55 ఎకరాలు, 8లో 0.21 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 9లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.60 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 11లో 7.53 ఎకరాలు, ప్లాట్‌ నెంబర్‌ 14లో 7.34 ఎకరాల భూమి ఉంది. మొత్తం 45.33 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏడు ప్రైమ్ ఓపెన్ ప్లాట్‌ల ఈ-వేలానికి పెట్టుబడిదారుల నుండి భారీ స్పందన లభించింది. ఇందులో కంపెనీలు, ట్రస్టులు, రిజిస్టర్డ్‌ సొసైటీలు, ఆర్థిక సంస్థలు ఈ వేలంలో పాల్గొన్నాయి. జులై 20న ప్రిబిడ్‌ సమావేశం నిర్వహించారు. జూలై 31 వరకు రిజిస్ట్రేషన్‌ ఫీజులను స్వీకరించారు. ముందస్తు డిపాజిట్‌ కింద ఆగస్టు 1లోగా ప్రతీ ప్లాటుకు రూ.5 కోట్లు చెల్లించారు. ఆగస్టు 3న ఈవేలం ప్రక్రియను చేపట్టారు.

6,7,8,9, 10, 11, 12, 13, 14 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేసింది. తెలంగాణలో ఒక ఎకరం ప్లాట్‌కు రూ. 100.75 కోట్లతో ఆల్ టైమ్ హై రికార్డ్‌ సృష్టించింది. మొత్తం ఏడు ప్లాట్లకు సగటు వేలం ఎకరాకు రూ.73.23 కోట్లు కాగా, ఎకరాకు రూ.35 కోట్ల ధర పలికింది. నిన్న ఉదయం.. 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా రూ.1,532.50 కోట్లు రాబట్టగా, సాయంత్రం 10, 11, 14 నెంబరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. 10 వ నెంబరు ప్లాట్‌ అత్యధికంగా రూ.100.75 కోట్ల ధర పలికింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీ బద్ధలయ్యాయి. ప్లాట్‌ నెంబర్‌ 10లో 3.60 ఎకరాల భూమి ఉండగా.. ఈ ఒక్క ప్లాట్‌తోనే హెచ్ఎండీఏకు రూ.360 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యల్పంగా ఎకరానికి రూ.67.25 కోట్లు వచ్చాయి. కోకాపేట్‌లో రెండో విడతలో భూముల ఈ- వేలం ద్వారా తెలంగాణ సర్కార్‌కు రూ. 3,319.60 కోట్లు ఆదాయం వచ్చింది.

ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. ఈ వేలంను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టిసి లిమిటెడ్ నిర్వహించింది. ఒక ఎకరానికి యావరేజ్ ధర రూ. 35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. ఈ వేలంలో యావరేజ్ ఎకరం ధర రూ. 73.23 కోట్లు రూపాయలు పలకడంతో హెచ్ఎండీఏకు కాసుల పంట పండినట్లయ్యింది. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 3.6 ఎకరాల భూమికి ఎకరానికి రూ.100.75 కోట్లు అత్యధిక ధర పలికింది. హెచ్‌ఎండీఏ, హైదరాబాద్‌ చరిత్రలో ఇదొక రికార్డు. రెండేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ 500 ఎకరాల్లో నియోపోలీస్‌ లేఅవుట్‌ను ప్రకటించి, ఆ తర్వాత 100-120 అడుగుల రోడ్లు, మురుగునీరు, తాగునీరు, భూగర్భ డక్ట్‌లతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడంతో గండిపేట మండలంలోని కోకాపేటకు పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడి భూములకు అనూహ్యమైన డిమాండ్ పెరిగింది.

Next Story