భాగ్య నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం ఎండ కొట్టినప్పటికీ క్రమంగా మబ్బులు కమ్ముకొని ఒక్కసారిగా వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అమీర్‌పేట, తర్నాక, చింతల్‌బస్తి, నాంపల్లి, లక్డీకపూల్, కోఠి, నారాయణ గూడలో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో ఆయా మార్గాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి కొమరిన్ ప్రాంతం వరకూ విస్తరించి ఉన్నట్లు చెప్పారు. రుతుపవనాలు సాధారణంగానే ఉన్నా వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని మామడలో 5.7 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా వికారాబాద్ జిల్లా పెద్దమంతాల్‌లో 5.2 సెం.మీ వర్షపాతం కురిసింది.