హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం భారీవర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై డ్రైనేజీ నీరు పొంగి ప్రవహించింది. బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నదులను తలపించాయి. భారీవర్షంతో వరదనీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. నగరంలోని పలు లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండటంతో.. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలుల వల్ల కరెంట్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
జీహెచ్‌ఎంసీ యంత్రాంగం రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతోంది. ఉదయం 5 గంటల నుంచే నగరంలో ఎడతెరపి లేకుండా వాన పడుతోంది. నగరవ్యాప్తంగా దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. మరో మూడు గంటల పాటు నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.