Hyderabad: తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ ఔట్‌పోస్టు దగ్గర తుపాకీ పేలుడు కలకలం రేపింది.
By అంజి Published on 23 Aug 2023 9:00 AM ISTHyderabad: తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ ఔట్‌పోస్టు దగ్గర తుపాకీ పేలుడు కలకలం రేపింది. ఓ హెడ్ కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. కబుతర్ఖాన ప్రాంతంలో రాత్రి విధులు ముగించుకుని నిద్రించే క్రమంలో హెడ్ కానిస్టేబుల్ భూపతి శ్రీకాంత్ చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.రక్తపు మడుగులో పడిఉన్న శ్రీకాంత్‌ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. అంతకుముందు ఘటనా స్థలాన్ని డీసీపీ సాయి చైతన్య పరిశీలించారు. టీఎస్‌ఎస్‌పీ నల్గొండ ఇ-కంపెనీకి చెందిన బి శ్రీకాంత్ హుస్సేనీ ఆలం పోలీసు అవుట్‌పోస్టులో రెండున్నర నెలలుగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్ మృతితో.. అతని ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే.. నెల రోజుల కిందట కూడా తుపాకీ మిస్ ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో మంచిర్యాల జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ రామయ్య ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందాడు. అతడు సెక్యూరిటీ గార్డుగా మింట్ కాంపౌండ్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చేతిలోని తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘనటలో అతడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.