Hyderabad: హరీష్‌రావుతో పాటు.. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు హౌజ్‌ అరెస్ట్‌

మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, టి శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు హౌజ్‌ అరెస్ట్‌ చేయబడ్డారు.

By అంజి  Published on  13 Sep 2024 7:45 AM GMT
Harish Rao, BRS leaders, house arrest, Hyderabad

Hyderabad: హరీష్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు హౌజ్‌ అరెస్ట్‌

హైదరాబాద్: మాజీ ఆర్థిక మంత్రి టి హరీష్ రావు, మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, టి శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకులను సెప్టెంబర్ 13, శుక్రవారం సిటీ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై గురువారం జరిగిన దాడికి ప్రతీకారంగా ఎలాంటి హింసాకాండ జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం. కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌లను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.

తన ఇంటిపై దాడికి ప్రతీకారంగా కౌశిక్ రెడ్డి.. అరికపూడి గాంధీ నివాసంలో పార్టీ సమావేశం నిర్వహిస్తామని ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరికపూడి గాంధీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు నేతృత్వంలోని గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

గాంధీ ఇంటికి చేరుకోవడానికి ర్యాలీగా బయలుదేరడానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, శ్రేణులు శుక్రవారం శంబీపూర్ రాజు నివాసం వద్ద గుమిగూడడం ప్రారంభించడంతో, నిరసనను విఫలం చేయడానికి, శాంతిభద్రతలను నిర్వహించడానికి పోలీసులు భద్రతను పెంచారు.

వివాదం యొక్క ప్రధాన అంశం

గాంధీ ఇంటికి ఆయన మద్దతుదారులు వెళ్లకుండా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎన్నికైనప్పటికీ జూలైలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మార్చి నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ చేసిన న్యాయ పోరాటం మధ్య రాష్ట్ర అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్‌గా ఆయన ఇటీవలి నియామకం వివాదాన్ని రేకెత్తించింది. తాను ఇంకా బీఆర్‌ఎస్‌తోనే ఉన్నానని గాంధీ చెప్పడంతో కౌశిక్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పార్టీ జెండాను ఎగురవేసి బీఆర్‌ఎస్ కండువా కప్పి సత్కరిస్తానని ప్రకటించారు.

దీంతో ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. గురువారం గాంధీ తన మద్దతుదారులతో కలిసి కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకుని సవాల్‌ చేసి బయటకు వచ్చేశారు. గాంధీ మద్దతుదారులు పాడి కౌశిక్‌ రెడ్డి ఇంటి ప్రాంగణంలోకి చొరబడి కిటికీ అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు. గాంధీని, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చట్టవిరుద్ధంగా సమావేశం, అల్లర్లు, అతిక్రమణ కింద వారిపై కేసు నమోదు చేయబడింది. తన నివాసంపై దాడికి పాల్పడినందుకు గాంధీపై చర్య తీసుకోవాలని, ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక పోలీసు అధికారిని బెదిరించినందుకు కౌశిక్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది.

Next Story