హైదరాబాద్‌లో వర్షాలకు మరో ప్రాణం బలి.. కరెంట్‌ షాక్‌తో కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్న సమయంలో ఆదివారం రాత్రి బైక్‌పై ప్రయాణిస్తుండగా విద్యుదాఘాతంతో 45 ఏళ్ల గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌

By అంజి  Published on  1 May 2023 7:43 AM IST
Hyderabad, rain,Greyhounds constable, electrocution

హైదరాబాద్‌లో వర్షాలకు మరో ప్రాణం బలి.. కరెంట్‌ షాక్‌తో కానిస్టేబుల్ మృతి

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల కారణంగా మ్యాన్‌ హోల్‌లో పడి 10 ఏళ్ల మౌనిక మరణించిన ఒక రోజు తర్వాత, హైదరాబాద్‌లో వర్షం కురుస్తున్న సమయంలో ఆదివారం రాత్రి బైక్‌పై ప్రయాణిస్తుండగా విద్యుదాఘాతంతో 45 ఏళ్ల గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ మరణించాడు. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ 1వ బెటాలియన్‌లో పనిచేస్తున్న తన తమ్ముడిని కలుసుకుని యూసుఫ్ గూడ నుంచి తిరిగి వస్తుండగా ఆదివారం తరాత్రి 9.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

45 ఏళ్ల సోలెం వీరాస్వామి ఫ్రీ లెఫ్ట్ రోడ్డులో ఎన్టీఆర్ భవన్ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఫుట్ పాత్‌పై ఉన్న విద్యుత్ స్తంభం అదుపు తప్పింది. దీంతో కానిస్టేబుల్‌ స్తంభానికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. వారు సీపీఆర్‌ని కూడా ప్రయత్నించారు. అతన్ని జూబ్లీహిల్స్‌లోని అపోలోకు తీసుకెళ్లారు. కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

మహబూబాబాద్‌కు చెందిన కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి గండిపేటలోని గ్రే హౌండ్స్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశారు.

ఏప్రిల్ 29న సికింద్రాబాద్‌లోని కలాసిగూడలో 10 ఏళ్ల బాలిక మ్యాన్‌హోల్‌లో జారిపడి మరణించింది. మౌనిక తన 15 ఏళ్ల సోదరుడితో కలిసి పాల ప్యాకెట్లు కొనేందుకు వెళ్లింది. మ్యాన్‌హోల్‌లో పడిన సోదరుడిని కాపాడే ప్రయత్నంలో జారిపడింది. బలమైన నీటి ప్రవాహాలు ఆమెను త్వరగా కొట్టుకుపోయేలా చేశాయి. చుట్టుపక్కల వారు ఎంత ప్రయత్నించినా ఆమెను రక్షించలేకపోయారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. మౌనిక కోసం కొన్ని గంటల పాటు అన్వేషణ సాగింది. అనంతరం ఆమె మృతదేహం సికింద్రాబాద్‌లోని పార్క్‌ లేన్‌ నాలా వద్ద లభ్యమైంది.

Next Story