ఫార్ములా E కార్ల కోసం గ్రీన్‌కో ప్రత్యేక గ్యారేజీలు
Greenko unveils custom-built garages for Formula E cars. హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIA ఫార్ములా E 2023 Greenko E-Prix కౌంట్‌డౌన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Feb 2023 3:15 PM GMTకార్లు, వాటి విడిభాగాలు, వివిధ పరికరాలు అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ కు చేరుకున్నాయి. రియాద్ నుంచి బోయింగ్ 747-400 చార్టర్ విమానం ద్వారా వాహనాల విడిభాగాలు శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలోని కార్గో విభాగానికి 90 టన్నుల రేసింగ్ కార్ల భాగాలు చేరుకున్నాయి. మరో రెండు విమానాలలో మిగతా రేసింగ్ కార్ల భాగాలు హైదరాబాద్ చేరుకోనున్నాయి. మొత్తం 22 కార్లను రవాణా చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లో ఫార్ములా ఇ కార్ల రాకపై Ace Nxt Gen అధికారులు ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, ఏజెన్సీల మధ్య సమన్వయం కారణంగా పలు అనుమతులు వెంటనే వచ్చాయి. ఈ కార్లు త్వరలో Greenko కొత్త పునరుత్పాదక శక్తితో నడిచే గ్యారేజీలలో ఉంటాయి. అభిమానులకు ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌ను ఎంజాయ్ చేయడానికి ఒక వేదికను అందిస్తాయి.
మనదేశంలో నిర్వహించబోయే మొట్ట మొదటి ఫార్ములా ఈ-రేసింగ్. హైదరాబాద్ ఈ-ప్రిక్స్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పటికే 2.8 కిలోమీటర్ల మేర ట్రాక్ ను ఏర్పాటు చేశారు. తాజాగా ఆ ఈవెంట్‌లో పాల్గొనే రేసింగ్ ఎలక్ట్రిక్ కార్లు కూడా నగరానికి చేరుకున్నాయి. ఫార్ములా E కార్ల ఆగమనం భారతదేశ మోటార్‌స్పోర్ట్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ రేసును ఫిబ్రవరి 11న హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ హైదరాబాద్‌ను కార్బన్ రహిత నగరంగా మార్చాలనే తెలంగాణ ప్రభుత్వ దార్శనికతను హైలైట్ చేయడమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ రేసింగ్‌లో థ్రిల్‌ను అనుభవించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఫార్ములా E లో విద్యుత్ శక్తితో నడిచే కార్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఈ రేసు పర్యావరణ అనుకూల విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటుంది.
మెక్‌లారెన్, మసెరటి, పోర్షే, జాగ్వార్, నిస్సాన్, మహీంద్రా రేసింగ్ వంటి ప్రముఖ కంపెనీలకు సంబంధించి 22 కార్లతో మొత్తం 11 జట్లు పాల్గొంటాయి. ఇక Gen3 ఎరా ఫార్ములా E కారును పరిచయం చేస్తుంది,ఈ కారు గరిష్ట వేగం 322kmph. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, తేలికైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత సమర్థవంతమైన ఎలక్ట్రిక్ రేస్ కారుగా గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 11న జరిగే ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో మొత్తం 11 జట్లు..22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ కోసం 2.8 కిలోమీటర్ల మేర 18మలుపులతో ఉన్న ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఈ రేసింగ్‌ను 21,000 వేలమంది వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేకంగా 11 స్టాండ్లు, 7గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కోసం 17 ప్రాంతాలను సిద్ధం చేశారు.