చర్లపల్లి జైలులో డీ-అడిక్షన్ సెంటర్‌ ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 'నివృతి' (NIVRUTTI) వ్యసన విముక్తి కేంద్రాన్ని ప్రారంభించారు.

By -  Knakam Karthik
Published on : 6 April 2026 8:20 PM IST

Hyderabad News, Telangana Governor, ShivPratapShukla, CherlapalliJail, Nivrutti, DeAddiction

చర్లపల్లి జైలులో డీ-అడిక్షన్ సెంటర్‌ ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం చెర్లపల్లి కేంద్ర కారాగారంలో 'నివృతి' (NIVRUTTI) వ్యసన విముక్తి కేంద్రాన్ని ప్రారంభించారు. మాదకద్రవ్యాల వినియోగం సామాజిక ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారిందని, దీన్ని అరికట్టేందుకు జైళ్ల శాఖ చేపట్టిన ఈ సంస్కరణలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో అనేకసార్లు జైలుకు వెళ్లిన అనుభవం ఉండటంతో ఖైదీలు, సిబ్బంది ఎదుర్కొనే సమస్యలపై తనకు అవగాహన ఉందని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేసుకున్నారు. 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు.

తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల బానిసత్వాన్ని శిక్షార్హమైన నేరంగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూడాలని, అందుకే కౌన్సెలింగ్, వైద్య చికిత్స అందించేలా 'నివృతి' కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం చంచల్‌గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి, నిజామాబాద్ కేంద్ర కారాగారాలతో పాటు హైదరాబాద్ మహిళా జైలులోనూ ఈ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. ఇప్పటివరకు 2,915 మంది ఖైదీలకు స్క్రీనింగ్ నిర్వహించగా, 590 మందికి ప్రత్యేక చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించినట్లు ఆమె వెల్లడించారు.

Next Story