గ్రేటర్ హైదరాబాద్‌కు మహిళా మేయర్
GHMC Women Mayor .. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు మొదలైంది. డిసెంబర్ 1న జరుగనున్న ఈ ఎన్నికల్లో మేయర్ పదవిని ఈసారి
By సుభాష్ Published on 18 Nov 2020 8:20 AM GMTజీహెచ్‌ఎంసీ ఎన్నికల పోరు మొదలైంది. డిసెంబర్ 1న జరుగనున్న ఈ ఎన్నికల్లో మేయర్ పదవిని ఈసారి మహిళకు కేటాయించారు. అలాగే జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి రిజర్వేషన్ వివరాలను వెల్లడించారు. ఎస్టీలకు రెండు , ఎస్సీలకు పది, బీసీలకు 25 సీట్లు రిజర్వ్ చేశారు. ఇక జనరల్ కేటగిరిలో 88 స్థానాలున్నాయి. అన్ని కేటగిరిల్లోనూ 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించారు.
ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు పొందవచ్చని పార్థసారథి తెలిపారు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో నామినేషన్ పత్రం, ఇతర పత్రాలను ప్రింట్ తీసుకుని వాటిని పూర్తి చేసిన తర్వాత సంబంధిత ఆర్వోకి పోటీ చేసే అభ్యర్థి లేదా వారిని ప్రతిపాదించిన వ్యక్తిగా సమర్పించాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు రూ.2,500 ఇతరులు రూ.5వేల నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎన్నికలకు 48 వేల పోలింగ్ సిబ్బంది
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1+3 చొప్పున మొత్తం నలుగురు ఎన్నికల సిబ్బంది నియమిస్తున్నామని ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. మరో 30 శాతం సిబ్బందిని రిజర్వ్‌లో పెడతామని, మొత్తం 50 వేల నుంచి 55వేల మంది సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీ-పోల్ సాఫ్ట్ వేర్ ద్వారా మూడు దశల్లో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక మహిళా అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఎన్నికల్లో విధుల్లో ఆ వార్డు స్థానికులు లేదా అదే వార్డులో పని చేసే వారికి వేరే దగ్గర విధులు వేస్తామని అన్నారు. మరోవైపు ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక ప్రతి పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకులతో పాటు అవసరమైన వెబ్ క్యాస్టింగ్ లేదా వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు
కాగా, రాజకీయ పార్‌టీలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం ప్లయింగ్ స్వ్కాడ్‌లు, నిఘా బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో జోన్‌కు ఒకరు చొప్పున ఆరుగురు సాధారణ పరిశీలకులు, సర్కిల్‌కు ఒకరు చొప్పున 30 మంది వ్యయ పరిశీలకులు, 30 మంది సహాయ వ్యయ పరిశీలకులను నియమించామని అన్నారు.
లైసెన్సులు ఉన్నవారు తమ ఆయుధాలను స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించాలని ఆదేశించారు. అనుమతిలేనిది ఆయుధాలను సీజ్ చేస్తామని, రౌడీషీటర్లను పోలీసులకు బైండోవర్ చేస్తామని, అనుమానస్పద వ్యక్తులపై నిఘా వేస్తామని అన్నారు. 356 రూట్ మొబైల్స్ పార్టీలు, 131 స్ట్రైకింగ్ ఫోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పహారా కాస్తాయని వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇద్దరు సాయుధ పోలీసులు, ఒక జ్యుడీషియల్ అధికారి ఉంటారన్నారు. ఈ జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల దాదాపు 25 నుంచి 30 వేల మంది వరకు పోలీసులు విధుల్లో పాల్గొంటారని అన్నారు.