భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్‌.. 12 గంటల పాటు ఈదురుగాలులతో వర్షం

GHMC Warning To Hyderabadis.భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్‌. హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా రానున్న 12 గంట‌ల పాటు బ‌ల‌మైన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2022 12:30 PM IST
భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్‌.. 12 గంటల పాటు ఈదురుగాలులతో వర్షం

భాగ్య‌న‌గ‌ర వాసుల‌కు అల‌ర్ట్‌. హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా రానున్న 12 గంట‌ల పాటు బ‌ల‌మైన ఈదురుగాలుల‌తో కూడిన మోస్తారు వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) తెలిపింది. ఈ రోజు ఉద‌యం 10.30 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఎక్కువ తీవ్ర‌తో గాలులు వీస్తాయ‌ని తెలిపింది. దీంతో చెట్లు కొమ్మ‌లు విరిగిప‌డే అవ‌కాశం ఉంద‌ని, న‌గ‌ర వాసులతో పాటు అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.

అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది. అత్యవసర సమయాల్లో డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఈవీడీఎం తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. అవ‌స‌రం అయితే.. 040-29555500కు ఫోన్ చేయాల‌ని అని అధికారులు తెలిపారు.

సంజీవ‌య్య పార్కులోని అతి పెద్ద జాతీయ జెండాకు న‌ష్టం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు పుర‌పాల‌క‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్ ట్విట్ చేశారు. జెండాను తాత్కాలికంగా కింద‌కు దించిన‌ట్లు తెలిపారు. కాగా..గ‌త ఐదు రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదిలాఉంటే.. కృష్ణా డ్రింక్రింగ్ వాట‌ర్ స‌ప్లై ప్రాజెక్ట్ ఫేజ్‌-1 మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు జ‌ల‌మండ‌లి తెలిపింది. అన్నిప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రా య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని వెల్లడించింది. కాగా.. ఫేజ్‌-1 సంబంధించిన జంక్ష‌న్ ప‌నుల వ‌ల్ల రేప‌టి నుంచి రెండు రోజుల పాటు నీటి స‌ర‌ఫ‌రాకు అంతరాయం ఉంటుంద‌ని ఇటీవ‌ల జ‌ల‌మండ‌లి అధికారులు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

Next Story