'భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి'.. హైదరాబాద్ ప్రజలకు అధికారుల హెచ్చరిక
హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున మొదలైన కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ చెరువుల్లా మారాయి.
By అంజి
'అప్రమత్తంగా ఉండండి'.. హైదరాబాద్ ప్రజలకు అధికారుల హెచ్చరిక
హైదరాబాద్‌లో ఈ రోజు తెల్లవారుజామున మొదలైన కుండపోత వాన కారణంగా రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. నాన్‌స్టాప్‌గా గంటకు పైగా క్లౌడ్ బరస్ట్‌లా వర్షం పడటంతో రోడ్డు ఎక్కడ ఉందో, మ్యాన్‌హోల్స్ ఎక్కడ ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ తెరిచే ఉన్న నేపథ్యంలో రోడ్లపైకి వచ్చేవారు అప్రమత్తంగా ఉండాలి. రోడ్లపై నిలిచి ఉన్న నీరు తగ్గేవరకు బయటికి రాకపోవడమే శ్రేయస్కరం.
దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, జవహర్‌నగర్, పాతబస్తీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, పటాన్‌చెరు, మియాపూర్, శామీర్‌పేట్, కీసర, ఉప్పల్, ఘట్‌కేసర్, సరూర్‌నగర్, శంషాబాద్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటోంది.
ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని 040 - 21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని చెప్పారు. నాన్‌స్టాప్ వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని తల్లిదండ్రులు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.