ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన

దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది.

By -  Knakam Karthik
Published on : 1 Oct 2025 7:16 AM IST

Hyderabad News, GHMC, accident insurance, GHMC employees

ఉద్యోగులకు 1.25 కోట్ల ప్రమాద బీమా..జీహెచ్ఎంసీ కీలక ప్రకటన

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తమ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. పారిశుద్ధ్య కార్మికుడి నుంచి ఉన్నతాధికారి వరకు అందరికీ వర్తించేలా, ఎలాంటి ప్రీమియం భారం లేకుండా రూ.30 లక్షల నుంచి రూ.1.25 కోట్ల వరకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)తో జీహెచ్ఎంసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

ఇటీవల వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక ప్రమాదవశాత్తు మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో తరచూ ప్రమాదాలకు గురయ్యే కార్మికులు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చొరవ తీసుకుని సింగరేణి సంస్థ తమ కార్మికులకు అందిస్తున్న బీమా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. దీని ప్రకారం రూ.25 వేల లోపు వేతనం పొందే వారికి రూ.30 లక్షలు, రూ.25 వేల నుంచి రూ.75 వేల మధ్య జీతం ఉన్నవారికి రూ.50 లక్షలు ప్రమాద బీమా లభిస్తుంది.

అలాగే, రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వేతనం ఉన్నవారికి రూ.కోటి, రూ.1.50 లక్షలకు పైగా జీతం అందుకునే వారికి రూ.1.25 కోట్ల బీమా కవరేజీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకంలో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే బీమా మొత్తంలో సగం పరిహారంగా అందుతుంది. ఒకవేళ విమాన ప్రమాదంలో మరణిస్తే బీమా మొత్తం రెట్టింపు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Next Story