బల్దియా బాస్ ఎవరు..? నేడే గ్రేటర్ ఫలితాలు..
GHMC Elections Result గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు.
By సుభాష్ Published on 4 Dec 2020 1:02 AM GMTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈసారి ఎన్నికల ప్రచారానికి అతి తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్లు ప్రచారం కొనసాగించారు. అలాగే మేయర్ స్థానాన్ని మహిళకు కేటాయించడంతో పలువురు ముఖ్యనేతలు మహిళలను బరిలో దింపారు. మేయర్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే ఈ లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు ఉంటుంది. ఈ సారి బ్యాలెట్ పత్రాలు కావడంతో కౌంటింగ్ కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
అయితే మెహిదీపట్నంలో మొదటి ఫలితం వస్తుంది. జీహెచ్‌ఎంసీలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక హాల్‌కి 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు.
మొత్తం 8152 మంది కౌంటింగ్ సబ్బంది ఉండగా, 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్‌కు సీసీ టీవీలు ఏర్పాటు చేశారు.
ఒక రౌండ్‌కు 14వేల ఓట్ల లెక్కింపు
ఇక రౌండ్‌కు 14 వేల ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌లో స్వస్తిక్ గుర్తు అభ్యర్థి సింబల్ మీద కాకుండా మరో చోటు వేస్తే దానిని ఏం చేయాలనే అంశంపై ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అలాగే కరోనా కారణంగా ముందు జాగ్రత్తగా ప్రతి టేబుల్ వద్ద శానిటైజర్లుఅందుబాటులో ఉంచారు. అలాగే మాస్కులు తప్పనిసరి ధరించే హాల్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
కాగా, డిసెంబర్ 1న 149 డివిజన్లలో 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 15,90,291 మంది ఉండగా, పురుషులు 18,60,040 మంది ఉన్నారు. ఇక అత్యధికంగా రామచంద్రాపురం డివిజన్‌లో 67.71 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసుఫ్‌గూడలో 32.99 శాతం పోలింగ్ నమోదైంది.
48 గంటల పాటు ర్యాలీలకు అనుమతి లేదు
మరో వైపు హైదరాబాద్ నగరంలో 48 గంటల పాటు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. 48గంటల పాటు ర్యాలీలను నిషేధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు సర్వేలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి.