గ్రేటర్ కౌంటింగ్: తొలి ఫలితం అక్కడి నుంచే..!
GHMC Elections Result 2020 .. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లోనే
By సుభాష్ Published on 4 Dec 2020 1:49 AM GMTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లోనే వెలువడనున్నాయి. ఇందుకు సంబంధించి కౌంటింగ్‌కు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక హాల్‌కి 14 టేబుళ్లు ఉంటాయి. ప్రతి టేబుల్‌కు ఒక సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు.
మొత్తం 8152 మంది కౌంటింగ్ సబ్బంది ఉండగా, 31 మంది కౌంటింగ్ పరిశీలకులు ఉంటారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్‌కు సీసీ టీవీలు ఏర్పాటు చేశారు. మొదటి రౌండ్ వివరాలు 11గంటల తర్వాతే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా, మెహిదీపట్నం డివిజన్‌లో 11,818 ఓట్లు పోలయ్యాయి. చాలా వార్డుల్లో 15 నుంచి 27వేల ఓట్లు పోలయ్యాయి. దీంతో 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రెండో రౌండ్లలో వెలువడే అవకాశాలున్నాయి. అత్యధికంగా ఓట్లు పోలైన ఉప్పల్, కంచన్‌బాగ్, మైలార్ దేవరపల్లి,అంబర్‌పేట, రెహమత్‌నగర్, కొండాపూర్, అల్లాపూర్, ఓల్డ్‌బోయిన్‌పల్లి,సుభాష్ నగర్, గాజుల రామారం, తార్నాక, సీతాఫల్‌మండి ఫలితాలు మూడో రౌండ్‌లో వెలువడే అకాశం ఉంది.
ఇప్పటికే కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హాల్‌లో ఓట్ల లెక్కింపు అంతా సీసీటీవీ కెమెరా, వీడియో గ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్‌ఫోన్ల అనుమతి లేదు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు
కాగా, గ్రేటర్‌లో 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా, 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.