డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ..?
GHMC Elections .. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది.
By సుభాష్ Published on 12 Nov 2020 4:57 PM ISTగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 15వ తేదీన షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ముందుగా డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా.. వర్షాలు, వరదల కారణంగా జనవరి, లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందని భావించారు. అయితే అఖిలపక్ష నేతలతో జీహెచ్‌ఎంసీ సమావేశమై ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలని ఈసీ కోరింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణలతో ప్రస్తుతం ఉన్న డివిజన్ల రిజర్వేషన్‌లను యధావిధిగా కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహిళలకు 2016లో అమలైన 50 శాతం రిజర్వేషన్‌లకు చట్టబద్దత లభించగా, ఈ మేరకు150 డివిజన్లలో 75 శాతం పూర్తి మహిళలకే కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ విషయమై ఈనెల 13న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు లిస్టును విడుదల చేయనుంది. రాజకీయ పార్టీలన్నీ ఓటరు జాబితాలో తప్పులపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాయి. గతంలో చోటు చేసుకున్న అవకతవకలను రాజకీయ పార్టీలు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకువచ్చాయి. ఒక్క రోజు రాజకీయ పార్టీకి 15 నిమిషాల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం సమయాన్ని కేటాయించింది. అయితే ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం చర్చించింది. అలాగే ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున తప్పులు చోటు చేసుకున్నాయని బీజేపీ ఆరోపించింది. స్థానిక నాయకులతో కలిసి అధికారులు ఓటర్లను తొలగించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓట్లను తొలగించిన విడిజన్ల వివరాలను వివరించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న ఓటర్ జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ నేతలు ప్రస్తావించారు. అలాగే పోలింగ్‌కు ఐదు రోజుల ముందు మద్యం షాపులను మూసివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.
2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికం..
2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికంగా తీసుకుని కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల ముందు రోజు వరకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10తో ముగియనుంది. అయితే మూడు నెలల ముందుగానే కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.