గ్రేటర్ ఎన్నికలపై అధికారుల కొరఢా.. ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలే
GHMC Elections Guidelines.. గ్రేటర్ ఎన్నికల సమయం మొదలైంది. నువ్వా... నేనా అన్నట్లు గ్రేటర్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో
By సుభాష్ Published on 20 Nov 2020 5:21 AM GMTగ్రేటర్ ఎన్నికల సమయం మొదలైంది. నువ్వా... నేనా అన్నట్లు గ్రేటర్ వార్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపించేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమవున్నారు. ఎన్నికల కోసం గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం, బ్యానర్లు కట్టడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవు. గోడల మీద రాతలు, పోస్టర్లు అంటించడం పూర్తిగా నిషేధం. ఎన్నికల నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల కోసం 30 వేల మందితో పోలీసులు బందోబస్తుకు సిద్దమవుతున్నారు.
ఎన్నికల వేడి రాజుకున్న జీహెచ్‌ఎంసీలో ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగుస్తుంది. ఆ తర్వాత నిర్వహించే ప్రచారం కోసం పార్టీలన్నీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాయి. ఎక్కడ ప్రచారం నిర్వహించాలి.. ఎక్కడ ఎవరు పాల్గొనాలి.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశాలపై పార్టీల నేతలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సమయంలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నియమావళి నిబంధనలను బల్దియా విడుదల చేసింది. గోడల మీద రాతలు, బ్యానర్లు, పోస్టర్లు, పేపర్లు అంటించడం, ప్రభుత్వ ఆవరణలు పాడు చేయడం వంటివి పూర్తిగా నిషేధం విధించారు.
పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వీలైనంత మేరకు ప్లాస్టిక్ పాలిథీన్‌తో తయారైన పోస్టర్లు, బ్యానర్లు వాడకం నివారించేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచించారు. అలాగే ఎన్నికల కోసం కరపత్రాలు లేక పోస్టర్లపై సంబంధిత ప్రింటర్, పబ్లిషరు పేర్లు, చిరునామా లేకకుండా ముద్రించరాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోసం ప్రతి అభ్యర్థి ఎంత ఖర్చు చేశారో వివరించాల్సి ఉంటుంది. ఎన్నికల పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచార సాధనాల్లోనూ ప్రచారం చేయరాదని స్పష్టం చేసింది.
లౌడ్ స్పీకర్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి
ఎన్నికల ప్రచారంలో భాగంగా లౌడ్ స్పీకర్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి చేసింది. బహిరంగ సమావేశాలు రహదారి ప్రదర్శనల్లో లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య ఇతర సందర్భాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతించింది. పబ్లిక్ సమావేశాలను రాత్రి 10 గంటల తర్వాత, ఉదయం 6 గంటలకన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించరాదని స్పష్టం చేశారు.
30 వేల మంది పోలీసులతో భద్రత
ఈ బల్దియా ఎన్నికలకు పోలీసు శాఖ కూడా సిద్దమైంది. మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 30 వేల మందితో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాగే నేరచరితులు, రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు.
లైసెన్స్ ఆయుధాలను పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి
గ్రేటర్ పరిధిలోని లైసెన్స్ ఆయుధాలను వెంటనే సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌లలో అప్పగించాలని ఎన్నికల సంఘం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు కూడా లైసెన్స్ ఉన్న ఆయుధాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఏఏ పోలీసు స్టేషన్ పరిధిలో ఎన్ని ఉన్నాయా.. వాటి లెక్కలు, డిపాజిట్లపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో దాదాపు 8482 మంది ప్రముఖులు ఆయుధ లైసెన్సులు కలిగి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వ్యక్తిగత భద్రత కోసం ఈ ఆయుధాలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆయుధాల సంఖ్య దాదాపు 9 వేలు దాటిందని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం. ఇందులో దాదాపు 7 వేలకుపైగా ఆయుధాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయని, మిగిలినవి జిల్లాల్లో ఉన్నట్లు
మద్యంపై ప్రత్యేక దృష్టి
కాగా, ప్రతి ఎన్నికల్లో, ప్రతి కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకునేది మద్యం గురించి. ఎన్నికలు వచ్చాయంటే చాలు మద్యం ఏరులై పారతుంది. అభ్యర్థులు గెలిచేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంటారు. మద్యం, నగదుతో పాటు వివిధ రూపాల్లో వారిని ప్రలోభాలకు గురి చేసే అంశంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఏదీ ఏమైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.