గ్రేటర్ హైదరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నేడు కౌంటింగ్ ఉండటంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కిలో మీటర్ పరిధి వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి నిషేధాజ్క్షలు అమల్లోకి వచ్చాయి. ఇవి సాయంత్రం ఆరు గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
రోడ్లపై జనం గూమిగూడవద్దని, ఊరేగింపులు, సమావేశాలపై నిషేధం ఉంటుంది. అలాగే టెంట్లు, స్టేజీలు, మైకులు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయవద్దని, ప్ల కార్డుల ప్రదర్శన, మత విద్వేషాలు రెచ్చగొట్టడం చేయవద్దని, రోడ్లు, కూడళ్లలో ప్రసంగాలు, ప్రదర్శనలను ఎలాంటి అనుమతిలేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు తమ తమ డివిజన్లలో కూడా సంబరాలు చేసుకునే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల తర్వాత మాత్రమే సంబరాలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. అది కూడా పోలీసుల అనుమతితోనే జరుపుకోవాలని స్పష్టం చేశారు.