మీరు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్లా... మీ వద్ద ఓటర్ ఐడికార్డు పోయిందా.. లేక ఇంట్లో ఇండి సమయానికి దొరకడం లేదా.. అయితే నో టెన్షన్. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును ఎన్నికల అధికారులకు చూపించి ఓటరు ప్లిప్‌తో ఓటు వేయవచ్చు. ప్రస్తుతం గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండటంతో ఇలాంటి సమస్య చాలా మందిలో తలెత్తుతుంది. అలాంటి వారి సమస్యకు పరిష్కారం అందిస్తున్నారు అధికారులు. ఓటరు లిస్టులో మీ పేరుండి ఓటరు కార్డు లేకపోయినా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా కార్డు చూపించి ఓటు వేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఓటు వేసేందుకు ముందుగా పోలింగ్ కేంద్రాల్లో ఓటరు గుర్తింపు నిర్ధారణకు కార్డును చూపించాల్సి ఉంటుంది. 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఆధార్, పాన్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్‌ఐడెంటటిఫై కార్డు, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో కూడిన పింఛన్ డాక్యుమెంట్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ, ఫ్రీడమ్ ఫైటర్ ఐడెంటీ కార్డు, అంగవైకల్య సర్టిఫికెట్, లోకసభ, రాజ్యసభ మెంబర్ ఐడెంటీ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ తదితర గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేయవచ్చని అధికారులు వెల్లడించారు.