యువరాజ్‌లా ఆడేందుకు రింకూ ప్రయత్నిస్తున్నాడు: గవాస్కర్

ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడిన రింకూ సింగ్‌ మెరుపుషాట్స్‌తో అందరి కళ్లలో పడ్డాడు.

By Srikanth Gundamalla  Published on  11 Dec 2023 2:51 PM IST
gavaskar,  rinku singh, team india, cricket,

యువరాజ్‌లా ఆడేందుకు రింకూ ప్రయత్నిస్తున్నాడు: గవాస్కర్

ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున ఆడిన రింకూ సింగ్‌ మెరుపుషాట్స్‌తో అందరి కళ్లలో పడ్డాడు. ఇక ఇటీవల జరిగిన ఆసీస్‌తో టీ20 మ్యాచుల్లో అయితే అద్భుతంగా రాణించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బ్యాటర్లలో చివరన వస్తూ బెస్ట్‌ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రింకూ సింగే టీమిండియాలో బెస్ట్‌ ఫినిషర్‌ అవుతాడని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ధోనీ తర్వాత అంతటి బెస్ట్‌ ఫినిషర్‌గా రింకూ తన పాత్ర పోషిస్తున్నట్లు మాజీ ప్లేయర్లు చెప్పారు. తాజాగా రింకూ సింగ్‌ గురించి భారత మాజీ క్రికెటరర్ గవాస్కర్ కూడా ప్రశంసలు కురిపించాడు. టీమిండియా సగర్వంగా తలెత్తుకోవడంలో యువరాజ్‌సింగ్‌ కీలక పాత్ర పోషించాడని.. ఇప్పుడు రింకూ సింగ్‌ కూడా అలా ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడని గవాస్కర్ అన్నారు.

టీమిండియాలో రింకూ సింగ్ తనదైన దూకుడు శైలిలో క్రికెట్ ఆడుతున్నాడని గవస్కార్ చెప్పాడు. అతడిపై ఇప్పటికే భారీ అంచనాలు క్రికెట్‌ అభిమానులంతా పెట్టుకున్నారని అన్నాడు. అంతేకాదు.. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అతడి ఆటపట్ల నమ్మకంతో ఉన్నారని చెప్పాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2011లో యూవీ అద్భుత ప్రదర్శనను కనబర్చాడు. అంతకుముందు 2007లో పొట్టి కప్‌ను కైవసం చేసుకోవడంలోను ముఖ్యపాత్ర ఉంది. రింకూ సింగ్‌ విషయంలో కూడా ఇదే జరగాలని ఆశిద్దామంటూ గవాస్కార్ చెప్పాడు. ప్రతిభ అనేది ఎవరూ ఇచ్చేది కాదు అనీ.. స్వతహాగా వచ్చేదన్నాడు. ఆటను ప్రేమించాలి.. నిరంతరం ఆడుతూ ఉండాలి.. అప్పుడే గొప్ప ప్లేయర్ అవుతారని చెప్పాడు. అవకాశాలు అన్నిసార్లు దొరకవు.. అది వచ్చినప్పుడు మాత్రం సాధించగలమనే నమ్మకంతో ఉండాలని చెప్పాడు. గత మూడేళ్లుగా రింకూ సింగ్ అదే చేస్తున్నట్లు చెప్పాడు. ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నా.. అతనికి అవకాశం లభించలేదు. కానీ.. వచ్చిన చాన్స్‌ను మాత్రం అందిపుచ్చుకుని అదరగొట్టాడు. ఇప్పుడు భారత జట్టులో కొనసాగుతున్నాడంటూ గవాస్కర్‌ రింకూ ఆటతీరును ప్రశంసించాడు.

టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టీమ్‌ మాజీ టాప్‌ ఆల్‌రౌండర్‌ కలిస్ కూడా రింకూ గురించి గొప్పగా చెప్పారు. రింకూ సింగ్ ఒక క్లాసిక్ ప్లేయర్ అని అన్నాడు. గత మ్యాచుల్లో రింకూ ఆట తీరు చూస్తేనే అది అర్థమైపోతుందని అన్నాడు. రింకూ ఎప్పుడూ దూకుడుగా ఆడటంలో వెనకడుగు వేయడని చెప్పాడు. అందుకే అతన్ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే మంచి ఫలితాలు ఉంటాయని దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ కలిస్ అన్నాడు.

Next Story