సభలు, ర్యాలీలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్
సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అన్నారు.
By అంజి Published on 1 Nov 2023 8:07 AM ISTసభలు, ర్యాలీలకు ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్
సభలు సమావేశాలు ర్యాలీలకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డి.ఈ.ఓ అనుదీప్ దురిశెట్టితో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ... ఎన్నికల నియమావళి నోటిఫికేషన్ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని తెలిపారు. ప్రచారంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించే స్థలం, సమయం తదితర వివరాలను స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా సభలో ఆటంకం కలిగించిన పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలని తెలిపారు. ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు బ్యాడ్జెస్, ఐడెంటి కార్డులు కలిగి ఉండాలని తెలిపారు. రాజకీయ నాయకులు పంపిణీ చేసే ఓటరు స్లిప్ లో ఎటువంటి సింబల్ గానీ, పార్టీ గుర్తు ఉండకూడదు అని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు రాజకీయ నాయకులు ఎలక్షన్ కమిషన్ పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారి కి, జోనల్, సెక్టర్ మెజిస్ట్రేట్ కు, సి.ఇ.ఓ, ఈ.సి.ఐ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రచారంలో కుల, మత, వర్గాల పై ఓటర్లను ఓట్లు అడగకూడదని తెలిపారు. కుల, మత, భాష లను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయకూడదని అన్నారు. ప్రార్థన స్థలంలో ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఓటర్లకు ఉచితాలు అందించకూడదని తెలిపారు. పోలింగ్ కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదు. ఏజెంట్లు, అభ్యర్థులు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లకూడదని, ఇతర పార్టీల పోస్టర్లను తొలగించకూడదని తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లను వినియోగించకూడదు అని అన్నారు. ఎన్నికల సమయంలో లిక్కర్ ను పంపిణీ చేయకూడదని తెలిపారు.
నవంబర్ 3వ తేదీన రిటర్నింగ్ అధికారులు ఫారం-1 ద్వారా నోటిఫికేషన్ జారీచేసే నామినేషన్ల స్వీకరణ చేపడతారని తెలిపారు. నామినేషన్ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకోవచ్చు అని తెలిపారు. నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 10వ తేదీ వరకు పనిదినాల్లో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అఫిడవిట్ లోని అన్ని కాలమ్స్ ను తప్పనిసరిగా నింపాలని తెలిపారు. అభ్యర్థి నామినేషన్ తో పాటు ఎలక్టోరల్ పేరు ఉన్న కాపీని జతచేయాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ పార్టీ కానీ, రిజిస్ట్రేషన్ పార్టీ అయితే కేవలం ఒకరు మాత్రమే ప్రపోజ్ చేయవచ్చని, ఇండిపెండెంట్ లకు పది మంది ప్రపోజ్ చేయాలని తెలిపారు. నామినేషన్ పత్రాలను ఆన్ లైన్ ద్వారా కూడా స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
నామినేషన్ పత్రాలు అభ్యర్థి కానీ, ప్రపోజల్ కానీ, ఎలక్షన్ ఏజెంట్ కానీ ఆథరైజ్డ్ పర్సన్ అందించవచ్చని తెలిపారు. హార్డ్ కాఫీని మాత్రం అర్ ఓ సూచించిన తేదీ న హర్డు కాఫీ సమర్పించాలని అన్నారు. నామినేషన్ వేసేటప్పుడు ఆర్.ఓ కార్యాలయంలో అభ్యర్థితో పాటు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పోటీలో ఉండే అభ్యర్థులు తమ క్రిమినల్ రికార్డులను లీడింగ్ న్యూస్ పేపర్స్, టి.వి ఛానళ్ల లో పబ్లిష్ చేయాలని తెలిపారు. అభ్యర్థితో పాటు ఆర్.ఓ కార్యాలయానికి మూడు వాహనాలు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. నామినేషన్ ముగిసిన అనంతరం ఓటరు స్లిప్ లను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటికి Proud to be voter అనే అంశంతో స్టిక్కర్లు అతికించి అవగాహన కల్పించడంతో పాటు ఇంటికి కరపత్రాల ద్వారా ఓటు పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ ను నోడల్ ఆఫీసర్ ద్వారా సిబ్బంది పేర్లను స్వీకరించి వారికి అందజేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు ప్రింటింగ్ మెటీరియల్ పై పబ్లిషర్ పేరు, అడ్రెస్ పొందుపర్చడం తో పాటు ఎన్ని ప్రతులను ప్రింటింగ్ చేస్తున్నారో వివరించి ప్రింటర్ పేరు అడ్రస్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో వినియోగించే పోస్టర్లు, బ్యానర్లు తదితర సామాగ్రి పై రేట్ చార్ట్ ప్రకారంగా ఖర్చులు జమ చేయాలని అన్నారు హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల ఆర్.ఓ ల ఫోన్ నెంబర్లు పొలిటికల్ ఏజెంట్లకు ఆర్.ఓ ద్వారా ఈ.వీ.ఎం ల పనితీరు పై అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీ లు కోరగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.