గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం ఘటన.. దొరకని బాధితురాలి ఆచూకీ
Gandhi Hospital Gang Rape case missing woman not find yet.హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి
By తోట వంశీ కుమార్ Published on 18 Aug 2021 8:44 AM ISTహైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన కేసులో మరో బాధితురాలి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. మరో బాధితురాలి కోసం పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నప్పటికి దొరక్కపోవడంతో కేసు మలుపులు తిరుగుతోంది. అటు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమామహేశ్వర్, సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై నిన్న సమీక్షించిన హోంమంత్రి మహమూద్ అలీ విచారణను మరింత వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్‌ను ఆదేశించారు.
గాంధీ ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలను పరిశీలించారు. 13వ తేదీన ఆమె వెళ్తున్న ఓ సీసీ ఫుటేజీని గుర్తించారు. దాని ఆధారంగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి 5 స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఇప్పటికే బాధితురాలి శాంపిల్స్ సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే అనుమానితుల శాంపిల్స్‌ను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఫోరెన్సిక్ నివేదికలు వస్తేనే ఈ కేసు కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.
అనేక ప్రశ్నలు..
అత్యాచారానికి గురైన మహిళ అపస్మారక స్థితిలో ఉండడాన్ని ఆమె అక్క కుమారుడు గుర్తించే వరకు సెక్యూరిటీ గార్డులు గానీ.. ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులు కానీ ఎవరూ ఎందుకు గమనించలేదు.? బాధితురాలిని చూసిన ఆమె అక్క కుమారుడు ఆస్పత్రి వర్గాలకు చెప్పకుండా మహబూబ్‌నగర్‌కు ఎందుకు తీసుకెళ్లాడు..? తన భార్య, మరదలు ఆస్పత్రిలో కనిపించకుండా పోగా కిడ్ని రోగి ఈ నెల 12న ఆస్పత్రి వర్గాలకు చెప్పకుండా కుమారుడితో పాటు మహబూబ్‌నగర్‌కు ఎలా వెళ్లిపోయాడు..? బాధితురాలు పోలీసులకు చెప్పేంత వరకు ఈ విషయం ఆసుపత్రి వర్గాలు ఎందుకు గుర్తించలేదు? ఈ విషయాలపై స్పష్టత లేకపోవడంతో పోలీసులు రోగి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. రెండో రోజు కూడా బాధితురాలు సరైన సమాచారం చెప్పకపోవడంతో సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నారు.
మహిళా సంఘాల ఆగ్రహాం..
మహిళా కమిషన్ సభ్యురాలు షబానా అఫ్రోజ్‌తో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతారెడ్డి నిన్న గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలిని గుర్తించిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విచారణ వేగంగా జరుగుతోందని, వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని అన్నారు. నిందితులను ఉపేక్షించబోమని, వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.