తొల‌గ‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు.. శిల్పాఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్‌

Gachibowli's Shilpa Layout flyover to open for public Today.హైద‌రాబాద్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోతుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Nov 2022 3:49 AM GMT
తొల‌గ‌నున్న ట్రాఫిక్ క‌ష్టాలు.. శిల్పాఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించ‌నున్న మంత్రి కేటీఆర్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రోజు రోజుకు ట్రాఫిక్ విప‌రీతంగా పెరిగిపోతుంది. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ట్రాఫిక్ ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది. స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లాన్ (SRDP )కింద ప‌లు లింక్ రోడ్లు, వంతెన‌ల‌ను నిర్మిస్తోంది. ఈ క్ర‌మంలో నేడు మ‌రో ఫ్లై ఓవ‌ర్ న‌గ‌ర వాసుల‌కు అందుబాటులోకి రానుంది. శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ నేడు(శుక్రవారం) ప్రారంభించనున్నారు.

శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండ‌డంతో ఔట‌ర్ రింగ్ రోడ్డు నుంచి గ‌చ్చిబౌలి మీదుగా ప‌ఠాన్ చెరు, కోకాపేట్‌, నార్సింగ్ నుంచి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేందుకు ప్ర‌యాణం సులువు కానుంది. SRDPలో భాగంగా నిర్మించిన 17వ ఫ్లై ఓవ‌ర్ ఇది. రూ.250కోట్ల వ్య‌యంతో 956 మీట‌ర్ల పొడవుతో 16 మీట‌ర్ల వెడ‌ల్పుతో నాలుగు వ‌రుస‌ల్లో నిర్మించారు.

అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుండి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుండి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్ లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించేబడే గచ్చిబౌలి నుండి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుండి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు.

ఈ ఫ్లై ఓవ‌ర్ అందుబాటులోకి రానుండ‌డంతో ప్ర‌యాణీకుల‌కు ట్రాఫిక్ తిప్ప‌లు కాస్త త‌ప్ప‌నున్నాయి.

Next Story