హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన ఫుడ్ డెలివరీ బాయ్ కుక్కల దాడి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. బుధవారం రాత్రి పెంపుడు కుక్క వెంటాడడంతో మూడు అంతస్తుల భవనంపై నుంచి దూకిన ఫుడ్ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ ఎగ్జిక్యూటివ్ మొహమ్మద్ రిజ్వాన్ (25), బంజారాహిల్స్‌లోని లుంబినీ రాక్ క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్న కుటుంబానికి ఫుడ్ పార్శిల్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు.
రిజ్వాన్ ఫుడ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, కస్టమర్ పెంపుడు కుక్క- జర్మన్ షెపర్డ్, అతన్ని చూసి మీద మీదకు రావడం ప్రారంభించిందని పోలీసులు తెలిపారు. దాడి జరుగుతుందనే భయంతో రిజ్వాన్ తప్పించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తు నుంచి దూకినట్లు తెలుస్తోంది. "అతను నేలపై పడి గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు" అని పోలీసు అధికారి తెలిపారు. ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కుక్క యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.