గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బహదూర్‌పురాకు సమీపంలో ఉన్న మిరాలం చెరువు పూర్తిగా నిండిపోయింది. భారీ వరదల కారణంగా మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లో అయ్యింది. దీంతో పక్కనే నెహ్రూ జులాజికల్ పార్కులోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్ సఫారీలోని వన్యప్రాణులను నైట్ ఎన్‌క్లోజర్‌లోకి తరలించారు.
ఈ క్రమంలోనే సందర్శకులు జూలోని సపారీ కాంప్లెక్స్‌ను అధికారులు మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు.
మరోవైపు కృష్ణా ఫేజ్-1 జంక్షన్ మరమ్మతు పనులు వాయిదా వేశారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటి సరఫరా జరుగుతుందని జలమండలి తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
నగర శివార్లలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండకుండలా మారాయి.