సికింద్రాబాద్‌లో కిడ్నాప్‌ అయిన బాలుడు సురక్షితం

నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన మరువక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మరో కిడ్నాప్‌ ఘటన చోటుచేసుకుంది.

By అంజి  Published on  30 Sept 2023 11:46 AM IST
kidnap, secundrabad railway staion, Hyderabad

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో బాలుడి కిడ్నాప్.. బెగ్గింగ్ ముఠా పనేనా.?

హైదరాబాద్‌: నీలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన మరువక ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మరో కిడ్నాప్‌ ఘటన చోటుచేసుకుంది. అయితే బాలుడిని పోలీసులు రక్షించినట్టు సమాచారం. మాదాపూర్‌ ఏరియాలో బాలుడిని పోలీసులు రక్షించినట్టు తెలుస్తోంది. సైబర్‌ టవర్న్‌ దగ్గర బాలుడిని అమ్మేందుకు కిడ్నాపర్లు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలంలోని రాయాలపురంకి చెందిన దుర్గేష్ అనే వ్యక్తి తన ఐదు సంవత్సరాల కుమారుడు శివసాయితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడు. తిరిగి 28వ తేదీన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. 28వ తేదీన ఉదయం5:30 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగిన దుర్గేష్ అలసిపోయి ఉండడంతో స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో దుర్గేష్ తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్‌ఫామ్‌ నెంబర్ ఒకటి దగ్గర ఉంచి వాష్ రూమ్ కి వెళ్ళాడు. దుర్గేష్ వచ్చి చూసేసరికి కొడుకు శివ సాయి కనిపించలేదు.

దుర్గేష్ చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వెతికినా కూడా కొడుకు గురించి ఎటువంటి జాడ తెలియకపోవడంతో వెంటనే జి ఆర్ పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు మూగ ,చెవిటి అని తండ్రి దుర్గేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో రైల్వే పోలీసులు వెంటనే స్పందించి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తుతెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకు వెళుతున్నట్లుగా గుర్తించారు. సిసి కెమెరాలో రికార్డు అయిన దృశ్యా లను ఆధారంగా చేసుకుని పోలీసులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బాలుడిని పోలీసులు మాదాపూర్‌లో గుర్తించి రక్షించారు.

Next Story