హైదరాబాద్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్బీ నగర్ జంక్షన్ సమీపంలోని గుంటి జంగయ్య నగర్‌లోని ఓ కార్ గ్యారేజీలో పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెకండ్ హ్యాడ్ కార్ షోరూమ్ గ్యారేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ''హైదరాబాద్‌లోని ఎల్‌బి నగర్‌లోని బివికె సినిమాస్ పక్కన ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్‌లో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు'' అని ఎల్‌బీ నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.
మంటలు చెలరేగిన సమయంలో గ్యారేజీలో దాదాపు 20 నుంచి 50 కార్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంటలు వ్యాపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్యారేజీలో సిలిండర్లు ఉండడంతో మంటలు చెలరేగుతుండగా పెద్ద శబ్ధాలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు గంటల పాటు శ్రమించి అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కారు గ్యారేజీ వెనుకున్న గృహోపకరణాల షోరూంకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గ్యారేజీ యజమాని దాదాపు 3 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని లబోదిబోమన్నారు. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన కార్లను చూసి సొమ్మసిల్లి పడిపోయారు.