హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఆరాంఘర్ చౌరస్తా సమీపంలోని 315 పిల్లర్ వద్ద ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాప్తించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకున్నారు.
దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. కాగా.. ఈ స్క్రాప్ దుకాణానికి ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.