కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నిజాంపేట పరిధిలోని హోలిస్టిక్ ఆస్పత్రి మొదటి అంతస్తులో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంటలు చెలరేగడంతో రోగులతో పాటు, వైద్య సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దాదాపు 5 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఐసీయూలోని రోగులకు సెక్యూరిటీ గార్డులు భుజాలపై వేసుకుని బయటకు తీసుకువచ్చారు. రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 70 మంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. షార్ట్ సర్య్కట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా.. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.