సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలోని రోగులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే వారు బయటకు పరుగులు తీశారు. ఆస్పత్రి సిబ్బంది మంటలను గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా విద్యుత్ బోర్డు ప్యానెల్‌లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది.
ప్రమాదంపై మంత్రి తలసాని ఆరా..
అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా, వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం మంత్రి తలసాని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన అనంతరం ఆస్పత్రి సందర్శిస్తానని చెప్పారు.